యూపీలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

యూపీలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
  • మరో 5 మందికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
  • స్పందించి కఠిన చర్యలకు ఆదేశించిన సీఎం యోగి

అలీఘర్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్లో కల్తీ మద్యం కాటుకు 11 మంది బలయ్యారు. మరో ఐదుగురు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.కార్సియాలోని ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని తాగిన వారంతా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఇద్దరు తమ కళ్ల ముందే చనిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు ట్రక్కు డైవర్లు మద్యం తాగిన కాసేపటికే అస్వస్థతకు గురై చనిపోయినట్లు డిఐజి దీపక్‌ కుమార్‌ మీడియాకు ధృవీకరించారు. అలీఘర్‌-తప్పాల్‌ జాతీయ రహదారి పక్కన గ్యాస్‌ డిపో వద్ద ట్రక్కు ఆపి మద్యం సేవించారని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు చెప్పారు. కాగా కర్సియా, దాని చుట్టు ప్రక్కన గ్రామాల నుండి పలువురు చనిపోయారని సమాచారం అందిందని డీఐజీ తెలిపారు. మొత్తంగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారని పోలీసులు చెబుతుండగా మృతుల సంఖ్య 11కు చేరిందని స్థానికులు చెబుతున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. 
నిందితులెంత బలవంతులైనా విడిచిపెట్టొద్దు.. మళ్లీ ఇలాంటివి జరగరాదు: సీఎం యోగి
అలీగఢ్ పరిధిలోని కుర్సువాలో కల్తీ మద్యం మహమ్మారి కాటు గురించి తెలిసిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల నుండి విచారించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని ఆదేశించారు. నిందితులెవరైనా.. వారి వెనుక ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మరోసారి ఇలాంటి ఉదంతాలు జరగకుండా చూడాలని సీఎం యోగి ఆదేశించారు.